Nisar Ahmed’s remarks: 2029లో జగన్ సీఎం ఖాయం
2029లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ స్పష్టం చేశారు. మదనపల్లె పట్టణంలోని ప్యారా నగర్‌లో ఉన్న పారడైజ్ ఫంక్షన్ హాల్‌లో మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశంలో మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్‌తో పాటు తంబళ్లపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి, అబ్జర్వర్ అనూష రెడ్డి, మదనపల్లె మున్సిపల్ చైర్‌పర్సన్ మనూజా కిరణ్ రెడ్డి, వైస్ చైర్మన్లు జింక వెంకటాచలపతి, నూర్ ఆజంతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సైన్యం లాంటి చురుకైన కార్యకర్తలతో కమిటీలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. పునాదులు గట్టిగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు తగిన బాధ్యతలు అప్పగిస్తూ కమిటీల ఏర్పాటు జరుగుతోందన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి నగదు లబ్ధి చేకూర్చిన విధానం ప్రజలకు మరోసారి గుర్తుచేయాలని పిలుపునిచ్చారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, జగన్ 2.0లో కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పకుండా ఉంటుందని నిసార్ అహ్మద్ భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


