NTR Statue Inauguration: మచిలీపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
ఎన్టీఆర్–వాజ్‌పేయి విగ్రహాలు ఒకేచోట ఏర్పాటు కావడం గర్వకారణం: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, కృష్ణా జిల్లా: మచిలీపట్నం హౌసింగ్ బోర్డు బైపాస్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నంలో దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మరియు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలను ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమని అన్నారు. దేశ రాజకీయాల్లో అటల్ జీ పాత్ర, రాష్ట్రాభివృద్ధిలో ఎన్టీఆర్ చేసిన సంస్కరణలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.
ఎన్టీఆర్ సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు చిగురుపాటి శ్రీరామ్, డిసిఎంఎస్ చైర్మన్ & జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


