Dalit youth murder: దళిత యువకుడి హత్యను నిరసిస్తూ శ్రీకాకుళంలో వైయస్ఆర్ సీపీ ధర్నా
పల్నాడు జిల్లా పిన్నెల్లిలో దళిత యువకుడు మండా సాల్మన్ను పాశవికంగా హత్య చేసిన ఘటనను నిరసిస్తూ శనివారం శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ నిరసనకు వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు. సాల్మన్ హత్య అత్యంత దారుణమైనదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు.
బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దళితులపై జరుగుతున్న దాడులపై రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, అందవరపు సూరిబాబు, గేదెల పురుషోత్తం తదితర నాయకులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దళితుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు.
మరిన్ని Andhra Pradesh Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


