Manyam village fire accident: సంక్రాంతి పండుగ వేళ తీవ్ర విషాదం
కాకినాడ జిల్లా మన్యం గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం – 40 ఇళ్లు కాలి బూడిద
సంక్రాంతి పండుగ ఆనందాల మధ్య కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో సుమారు 40 ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామమంతా భయాందోళనకు గురైంది.
సంక్రాంతి పండుగ సరుకుల కోసం గ్రామస్థులు సమీప పట్టణమైన తునికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం మరింత విషాదాన్ని నింపింది. పండుగకు కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేసి తిరిగి గ్రామానికి చేరుకున్న గ్రామస్థులు, తమ ఇళ్లు పూర్తిగా దగ్ధమైన దృశ్యాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చినా, ఫైర్ ఇంజన్ తుని నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సి ఉండటంతో అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేసరికి ఇళ్లు, గృహోపకరణాలు, ధాన్యం, పండుగ సరుకులు అన్నీ బూడిదయ్యాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్ లీక్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టామని, ప్రమాదానికి గల అసలు కారణాలను నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా, పేద కుటుంబాలు తమ సర్వస్వాన్ని కోల్పోయాయి. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పండుగ వేళ జరిగిన ఈ ప్రమాదం మన్యం గ్రామాన్ని విషాదంలో ముంచేసింది.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


