SBI MoU: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ప్యాకేజీ అమలుకు ఎస్‌బీఐతో ఎంఓయూ
ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి రూ.1 కోటి భీమా చెక్కు అందజేత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ప్యాకేజీ అమలుకు సంబంధించిన కీలక అడుగు పడింది. ఈ నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు పాల్గొన్నారు.
ఈ ఎంఓయూ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు మరింత సులభతరం అవుతాయని, బ్యాంకింగ్ సేవలు పారదర్శకంగా మరియు సమర్థవంతంగా అమలవుతాయని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా, గత సంవత్సరం మే నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్థిక శాఖ ఉద్యోగి శ్రీమతి కుసుమ కరుణ కుమారి గారి కుటుంబ సభ్యులకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మంజూరైన రూ.1 కోటి ప్రమాద భీమా మొత్తానికి సంబంధించిన చెక్కును ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు స్వయంగా అందజేశారు.
మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. విధి నిర్వహణలో ఉద్యోగికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రమాద భీమా సదుపాయం ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


