AP FIRST research center: ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపే దిశ
ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపే దిశగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. AP FIRST (Andhra Pradesh Futuristic Innovation & Research in Science and Technology) పేరుతో తిరుపతిలో అత్యాధునిక రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ మేరకు మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏరోస్పేస్–డిఫెన్స్, ఐటీ–డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాలకు చెందిన సలహాదారులు, నిపుణులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ హబ్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను సీఎం ఆమోదించారు. ఈ కేంద్రం ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి ఆధునిక రంగాల్లో పరిశోధనలు జరగనున్నాయి. అంతేకాకుండా పరిశ్రమలు–విద్యా సంస్థల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు.
ఈ కీలక సమావేశంలో ఏరోస్పేస్–డిఫెన్స్ సలహాదారు శ్రీ సతీష్ రెడ్డి, ఐటీ–డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సలహాదారు శ్రీ అమిత్ దుగర్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ శ్రీ కె.ఎన్. సత్యనారాయణ, ప్రొఫెసర్ శ్రీ సెంథిల్ కుమార్, డీఎంటీఐ డైరెక్టర్ కల్నల్ పి.ఎస్. రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
AP FIRST రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు ద్వారా యువతకు ప్రపంచ స్థాయి పరిశోధనా అవకాశాలు కల్పించడంతో పాటు, రాష్ట్రంలో స్టార్టప్ సంస్కృతి, ఆవిష్కరణలకు కొత్త ఊపిరి లభించనుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో తిరుపతి విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో జాతీయ స్థాయి కేంద్రంగా ఎదగనుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


