Rural Medical Services: వైద్యులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు
నెలలో కనీసం ఒకరోజైనా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించి పేద ప్రజలకు అండగా నిలవాలని వైద్యులకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. శనివారం కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం (రాంకోసా) ఆధ్వర్యంలో నిర్మించబోయే నూతన భవనాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“వైద్యో నారాయణో హరి అంటారు… అంటే వైద్యులు దేవుళ్లతో సమానం. తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మనిస్తారు” అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వైద్యులు ఎంత బిజీగా ఉన్నా, నెలలో ఒకరోజు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు, అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
1958లో ప్రారంభమైన రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడకు గర్వకారణమని, రాష్ట్రానికి ఎంతోమంది నాణ్యమైన వైద్యులను అందించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు అనుబంధంగా పనిచేస్తూ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తోందన్నారు.
పూర్వ విద్యార్థుల సంఘం రాంకోసా రూ.10.11 కోట్ల వ్యయంతో కళాశాల కోసం నూతన భవనాన్ని నిర్మించడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్లు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
యువత విశాల దృక్పథంతో కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ఆలోచించాలని, దాతల సదుద్దేశాన్ని గౌరవిస్తూ విద్యా సంస్థలను మరింత బలోపేతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


