Jagganna Thota Prabala Teertham: జగ్గన్న తోట ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా
400 ఏళ్ల ప్రాచీన సంప్రదాయానికి ప్రభుత్వ గుర్తింపు – సీఎం నారా చంద్రబాబు నాయుడు
సుమారు 400 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహోత్సవం జగ్గన్న తోట ప్రభల తీర్థంకు రాష్ట్ర పండుగ హోదా కల్పించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
కోనసీమ ప్రాంతంలోని జగ్గన్న తోటలో ప్రతి సంవత్సరం కనుమ రోజున నిర్వహించే ఈ అతిపెద్ద పండుగలో, 11 పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్న కోనసీమ ప్రజల భక్తి, విశ్వాసాలకు గౌరవంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.
సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే ఈ మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్న మంత్రివర్గ నిర్ణయంతో, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం అందనుంది. భద్రత, మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి.
ఈ నిర్ణయం ద్వారా కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర స్థాయిలో ఆధ్యాత్మిక సంప్రదాయాలకు కొత్త గుర్తింపు లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జగ్గన్న తోట ప్రభల తీర్థం రాష్ట్ర గౌరవాన్ని చాటే వేడుకగా మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


