Payakaraopeta Constituency: పాయకరావుపేట నియోజకవర్గం అణుకు గిరిజన గ్రామంలో కనుమ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిత వంగలపూడి
పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటవురట్ల మండలం అణుకు గిరిజన గ్రామంలో కనుమ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి అనిత వంగలపూడి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ దేవత పరిదేశమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి–కనుమ పర్వదినాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
రూ.2.5 కోట్ల రహదారి మంజూరు – గిరిజన గ్రామ అభివృద్ధికి పలు హామీలు
గతంలో అణుకు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ. 2.5 కోట్ల విలువైన రహదారి నిర్మాణానికి మంజూరైన ఆర్డర్ కాపీని గ్రామస్తులకు అందజేశారు. అభివృద్ధి పనుల ఆమోదంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిత వంగలపూడి మాట్లాడుతూ, గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మారుమూల ప్రాంతమైన అణుకు గ్రామంలో త్వరలోనే రేషన్ డిపో ఏర్పాటు, సెల్ టవర్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
గ్రామస్తులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గిరిజన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి, తన స్వహస్తాలతో వారికి భోజనం వడ్డించడం ద్వారా ప్రజలతో ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు.
“అనితమ్మ మా గ్రామానికి రావడం మాకు పెద్ద పండుగ” అంటూ గ్రామస్తులు చూపిన ఆదరాభిమానాలు తనకు మరచిపోలేని అనుభూతిగా మిగిలాయని ఎమ్మెల్యే తెలిపారు. అణుకు గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


