Kotappakonda Road: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి భక్తులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కోటప్పకొండ – కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన నూతన రహదారిని ఆయన గురువారం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
కోటప్పకొండ క్షేత్ర దర్శనం అనంతరం కొండ దిగువన ఉన్న శివస్థూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం రోడ్డుపై నడుస్తూ నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. రూ. 3.9 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో సుమారు 8 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు.
గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు భక్తుల సౌకర్యార్థం ఈ రోడ్డు నిర్మాణంపై విజ్ఞప్తి చేయగా, శివరాత్రి ఉత్సవాల్లోపు రోడ్డు పూర్తిచేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేస్తూ రహదారిని ప్రారంభించడం విశేషం.
ఈ రహదారి ప్రారంభంతో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సుమారు లక్షన్నర మంది భక్తులకు ప్రయాణ కష్టాలు తొలగనున్నాయి. అలాగే కొత్తపాలెం గ్రామ పరిసర రైతులకు, గోనేపూడి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఈ సందర్భంగా గోనేపూడి పాఠశాల విద్యార్థులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి రహదారి సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
గిరిప్రదక్షణ మార్గం లే అవుట్ పరిశీలన
త్రికోటేశ్వరస్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో కొండ చుట్టూ నిర్మించనున్న గిరిప్రదక్షణ మార్గానికి సంబంధించిన నమూనా లే అవుట్‌ను పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. అటవీశాఖ అనుమతుల ప్రక్రియపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన గిరిప్రదక్షణ మార్గం నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వనవిహారి జింకల పార్క్ సందర్శన
అనంతరం కోటప్పకొండ ఘాట్ రోడ్డులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనవిహారి జింకల పార్కును ఉప ముఖ్యమంత్రి సందర్శించారు. జింకలకు స్వయంగా ఆహారం అందించి, పార్కులోని జింకలు, పక్షి జాతులు, వృక్ష సంపదపై అటవీశాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పార్క్‌లో ఏర్పాటు చేసిన ట్రైన్ నిర్వహణపై కూడా ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జనసేన నరసరావుపేట ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ సయ్యద్ జిలాని, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృత్తికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


