AP Athletics Championship 2025: రాష్ట్ర స్థాయిలో మెరిసిన వసంత కోలయ్యవలస యువ అథ్లెట్‌కు ఎమ్మెల్యే అభినందనలు
క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువతకు ప్రోత్సాహం అందించడంలో నెల్లిమర్ల శాసనసభ్యురాలు శ్రీమతి లోకం నాగ మాధవి గారు మరోసారి తమ విశాల హృదయాన్ని చాటుకున్నారు.
పూసపాటిరేగ మండలం వసంత కోలయ్యవలస గ్రామానికి చెందిన యువ అథ్లెట్, ఇటీవల చీరాలలో నిర్వహించిన 36వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ – 2025లో అద్భుత ప్రతిభ ప్రదర్శించి 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు.
అంతేకాకుండా సౌత్ జోన్ నేషనల్స్ – 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకం గెలుచుకుని జిల్లా స్థాయిలో గర్వకారణంగా నిలిచారు.
ఈ విజయాల సందర్భంగా యువ అథ్లెట్ మాట్లాడుతూ, గతంలో సరైన క్రీడా కిట్ లేకపోవడం వల్ల అనేకసార్లు పోటీలకు దూరమయ్యానని తెలిపారు. తన పరిస్థితిని తెలుసుకున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు వెంటనే స్పందించి అవసరమైన అథ్లెటిక్స్ కిట్‌ను అందించడంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగానని కృతజ్ఞతతో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు తమ కార్యాలయంలో అథ్లెట్‌ను కలుసుకుని శాలువాతో సత్కరించి, ఘనంగా అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
క్రీడల్లో రాణిస్తున్న యువతకు తమ పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అవసరమైన సహకారం అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు స్పష్టం చేశారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


