Araku MP Tanuja Vinay: అంబులెన్స్‌లను తక్షణమే మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు అందుబాటు
ఐటీడీఏ పాడేరు ప్రభుత్వ అంబులెన్స్ గ్యారేజ్‌లో (మరమ్మత్తు కేంద్రం) వాడుకలో లేని అంబులెన్స్‌లను తక్షణమే మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు డా. గుమ్మ తనూజ వినయ్ ఆదేశించారు.
ఇటీవల ఎంపీ నిధులతో అల్లూరి జిల్లా పరిధిలో పది కొత్త అంబులెన్స్‌లను సమకూర్చిన ఎంపీ గారు, జిల్లా కేంద్రం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలోని ప్రభుత్వ అంబులెన్స్ గ్యారేజ్‌ను సందర్శించి అక్కడ మూలన పడిన వాహనాలను పరిశీలించారు. టైర్లు, సస్పెన్షన్ సమస్యలు, వైద్య పరికరాల లోపాలు, కూలింగ్ సిస్టమ్ పనిచేయకపోవడం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వంటి కారణాలతో అనేక అంబులెన్స్‌లు వినియోగంలో లేకపోవడాన్ని గుర్తించారు.
అల్లూరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మరియు ఆసుపత్రులలో నిలిచిపోయిన అన్ని అంబులెన్స్‌లకు తక్షణమే మరమ్మత్తులు చేపట్టి గిరిజన ప్రజల అనారోగ్య అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిణి, జాయింట్ కలెక్టర్ శ్రీ పూజ గారిని ఎంపీ ఆదేశించారు.
చిన్న సమస్యలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయని పేర్కొన్న ఎంపీ తనూజ వినయ్, అంబులెన్స్‌ల నిర్వహణ, సిబ్బంది శిక్షణ, కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత అవసరమని సూచించారు. అలాగే అంబులెన్స్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడం, స్థానిక యువత మరియు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు.
దీనికి సానుకూలంగా స్పందించిన ఐటీడీఏ పాడేరు ప్రాజెక్ట్ అధికారిణి, జాయింట్ కలెక్టర్ శ్రీ పూజ గారు, గిరిజన ప్రాంతానికి 10 అంబులెన్స్‌లను సమకూర్చడం చారిత్రాత్మక అడుగని, వాడుకలో లేని అంబులెన్స్‌లను కూడా మరమ్మత్తులు చేపట్టి తమ పూర్తి సహకారంతో గిరిజన ప్రజల ఆరోగ్య అవసరాలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


