Bangladeshi fishermen: బంగ్లాదేశ్ చెరలో చిక్కుకున్న మత్స్యకార కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని బాధిత మత్స్యకార కుటుంబాలను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు, రాష్ట్ర MSME, సెర్ప్ మరియు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా విజయనగరం ఆర్డీవో (RDO), సంబంధిత అధికారులు, స్థానిక మత్స్యకార నాయకులతో కలిసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం మరియు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.
ఆర్థిక భరోసా
బంగ్లాదేశ్ చెరలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ.30,000 చొప్పున మొత్తం 9 మంది లబ్ధిదారులకు మంజూరైన సహాయక చెక్కులను మంత్రి, ఎమ్మెల్యే గారు అందజేశారు.
నిత్యవసరాల పంపిణీ
ప్రతి బాధిత కుటుంబానికి బియ్యం, పప్పులు, నూనె వంటి నిత్యవసర వస్తువులను పంపిణీ చేసి, కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
సురక్షిత రాకకు చర్యలు
విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ మత్స్యకారులను త్వరగా సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు మాట్లాడుతూ,
“మన మత్స్యకార సోదరులు పరాయి దేశంలో ఇబ్బందులు పడుతుంటే వారి కుటుంబాల బాధ వర్ణనాతీతం. ఒక సోదరిగా నేను ఎప్పుడూ మీకు అండగా ఉంటాను. వారు తిరిగి వచ్చేవరకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయం అందిస్తాం” అని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల భద్రత, వారి కుటుంబాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


