AP Health Department: అభివృద్ధిని ఓర్చుకోలేక వైసీపీ విష ప్రచారం చేస్తోంది – టీ.సీ. వరుణ్
ఆపత్కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడుతున్న 104, 108 అంబులెన్స్ సేవలపై వైసీపీ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా నిరాధారమని జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ శ్రీ టీ.సీ. వరుణ్ గారు మండిపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శనంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి చిత్తశుద్ధితో వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణల్లో భాగంగా 104, 108 అంబులెన్స్ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అంబులెన్స్ వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యమైందో ప్రజలందరికీ తెలుసునని, అప్పట్లో సరైన నిర్వహణ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందిస్తూ ప్రాణాలు కాపాడుతున్న సేవలను చూసి వైసీపీ నేతలకు కడుపు మంట పెరుగుతోందని విమర్శించారు.
అంబులెన్స్ సేవలపై వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే కూటమి పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలోనే గట్టిగా తిప్పికొడతారని టీ.సీ. వరుణ్ గారు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం, భద్రతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే దుష్ప్రచారాలకు తావు లేదని స్పష్టం చేశారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


