New Year tragedy Hyderabad:బిర్యాని తిన్న వ్యక్తి మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర అస్వస్థత
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలు విషాదంగా మారాయి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్‌లో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం సేవించిన అనంతరం బిర్యానీ తిన్న స్నేహితుల్లో ఒకరు మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర అస్వస్థత కలిగింది.
బిర్యానీ తిన్న కొద్దిసేపటికే పాండు (53) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే బిర్యానీ తిన్న మరో 15 మందికి వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో వారిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బిర్యానీ విషపూరితమా? ఫుడ్ పాయిజనింగ్ కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. బిర్యానీ నమూనాలను పరీక్షలకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకల్లో ఆహారం, మద్యం విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.
మరిన్ని Crime News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


