Nagarkurnool tragic incident: నాగర్‌కర్నూలు కల్వకుర్తిలో హృదయవిదారక ఘటన
నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో న్యూ ఇయర్ రోజున హృదయవిదారక విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మృతిని తట్టుకోలేక భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లి, కుమార్తె మృతి చెందగా కుమారుడు కొనప్రాణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కల్వకుర్తి పట్టణంలోని తిలక్‌నగర్‌లో నివాసం ఉంటున్న భీమ్‌శెట్టి ప్రకాశ్ (40) సుమారు 40 రోజుల క్రితం మృతి చెందాడు. భర్త మృతి తర్వాత తీవ్ర మానసిక వేదనకు లోనైన ఆయన భార్య ప్రసన్న (40), భర్త లేని జీవితం తనకు అవసరం లేదని భావించి పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రసన్న తన కుమారుడు అశ్రిత్, కుమార్తె మేఘన (13)తో కలిసి కేక్ కట్ చేసి న్యూ ఇయర్‌ను స్వాగతించింది. అనంతరం పురుగుల మందు కలిపిన అన్నాన్ని ఇద్దరు పిల్లలకు తినిపించి తాను కూడా అదే ఆహారాన్ని తీసుకుంది.
విషం ప్రభావంతో తల్లి ప్రసన్న, కుమార్తె మేఘన పరిస్థితి విషమించి మృతి చెందారు. కుమారుడు అశ్రిత్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కల్వకుర్తిలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
మరిన్ని Crime News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


