Mann Ki Baat 129th Edition: 2025లో భారత్ బలమేంటో ప్రపంచం చూసింది.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ
కొత్త ఆశలు, కొత్త సంకల్పంతో భారత్ 2026లోకి అడుగు పెడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అన్నారు. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాతో ప్రారంభమైన 2025 సంవత్సరం భారతదేశానికి అనేక గర్వకారణమైన క్షణాలను అందించిందని తెలిపారు. ఇవాళ జరిగిన 129వ మన్ కీ బాత్ కార్యక్రమంలో (Mann Ki Baat 129th Edition) దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, 2025లో భారత్ ప్రపంచ వేదికపై సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి స్పష్టమైన సందేశం
2025 సంవత్సరం జాతీయ భద్రత పరంగా భారత్ బలాన్ని ప్రపంచానికి చాటిందని మోడీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌ను మారుతున్న భారతావనికి ప్రతీకగా అభివర్ణిస్తూ, ఈ సైనిక విజయం దేశవ్యాప్తంగా దేశభక్తిని పెంచిందన్నారు. దేశ భద్రత విషయంలో భారత్ ఎలాంటి రాజీ పడదన్న విషయం ప్రపంచానికి స్పష్టంగా అర్థమైందని చెప్పారు. ఈ ఆపరేషన్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందన్నారు.
క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్
2025 క్రీడల పరంగా కూడా చిరస్మరణీయమైన సంవత్సరమని ప్రధాని తెలిపారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ICC ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగా, మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ సాధించడం చరిత్రగా నిలిచిందన్నారు. మహిళల అంధుల T20 ప్రపంచ కప్ విజయం భారత కుమార్తెల సత్తాను చాటిందని ప్రశంసించారు. ఆసియా కప్ T20లోనూ త్రివర్ణ పతాకం గర్వంగా ఎగరిందని గుర్తు చేశారు. పారా అథ్లెట్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అనేక పతకాలు సాధించినందుకు అభినందనలు తెలిపారు.
యువత, సైన్స్, ఇన్నోవేషన్‌పై ఫోకస్
వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని మోడీ చెప్పారు. జనవరి 12న జరగనున్న యంగ్ ఇండియా లీడర్ సదస్సులో దేశం నలుమూలల నుంచి యువత తమ ఆలోచనలు పంచుకుంటారని తెలిపారు. తాను కూడా ఈ సదస్సులో పాల్గొంటానని చెప్పారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో విద్యార్థులు స్మార్ట్ ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అద్భుత ఆవిష్కరణలు చేశారని ప్రశంసించారు.
సంస్కృతి, భాషలు, ప్రకృతి సంరక్షణ
వారణాసిలో జరిగిన కాశీ-తమిళ సంగమం ద్వారా భాషల మధ్య సాంస్కృతిక ఐక్యత పెరిగిందన్నారు. హిందీ మాతృభాష అయిన పిల్లలు కూడా తమిళం నేర్చుకుంటున్నారని తెలిపారు. దేశంలో చిరుతల సంఖ్య 30కి మించిందని, ఇది ప్రకృతి సంరక్షణకు నిదర్శనమని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, మహిళా సాధికారత, వోకల్ ఫర్ లోకల్ ద్వారా దేశీయ ఉత్పత్తుల ప్రోత్సాహంపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మరిన్ని International News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


