Palairu constituency development: రూ. 362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 18న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
పాలేరు నియోజకవర్గ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో రూ. 362 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఈ నెల 18న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడైంది.
సీఎం గారి పాలేరు పర్యటనను పురస్కరించుకుని, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి సభాస్థలి ఏర్పాట్లను ఈరోజు పరిశీలించారు. అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం—
మద్దులపల్లిలో జేఎన్‌టీయూ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ప్రారంభోత్సవంతో పాటు, కూసుమంచిలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు.
ఈ భారీ అభివృద్ధి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క గారు, మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీ దామోదర రాజనర్సింహ గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారు తదితరులు పాల్గొననున్నారు. ఇదే వేదికగా రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
అదేవిధంగా, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ మీటింగ్) నిర్వహించనున్నారు. సమ్మక్క–సారలమ్మ జాతరను కుంభమేళాను మించిన స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
మేడారంలో కాకతీయుల నాటి వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన రాతి కట్టడాలను ఈ నెల 19వ తేదీ ఉదయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు.
మరిన్ని Latest News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


