Gulf Death Body Repatriation: కంపెనీ, ఇండియన్ ఎంబసీ చేతులెత్తేసిన వేళ సీఎం సహాయనిధి నుంచి తక్షణ సహాయం
హైదరాబాద్: గల్ఫ్ దేశంలో మృతి చెందిన ఓ ప్రవాస కార్మికుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఖర్చు భరించలేమని కంపెనీ యాజమాన్యం, నిధుల్లేవంటూ ఇండియన్ ఎంబసీ కూడా చేతులెత్తేసిన క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ముందుకొచ్చి వ్యయాన్ని భరించిన అరుదైన మానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇది ప్రవాస తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి చూపుతున్న బాధ్యతా భావానికి మరో నిదర్శనంగా నిలిచింది.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యామ్చా గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు (తోగరి అబ్బయ్య) (40) నాలుగు నెలల క్రితం ఓమాన్‌లోని సలాలా ప్రాంతానికి క్లీనింగ్ కంపెనీలో పని చేయడానికి వెళ్లాడు. యాజమాన్య వైఖరి నచ్చక కంపెనీ నుంచి బయటకు వచ్చిన కొంతకాలానికే, డిసెంబర్ 14న ఇబ్రి ప్రాంతంలో మృతి చెందాడు. అనుమతి లేకుండా కంపెనీ నుంచి వెళ్లిన కారణంగా అక్కడి చట్టాల ప్రకారం అతడిని ‘ఖల్లివెల్లి’గా పరిగణించడంతో, మృతదేహం తరలింపుకు కావాల్సిన సదుపాయాలు రద్దయ్యాయి.
ఈ నేపథ్యంలో, “కంపెనీ నుంచి వెళ్లిపోయిన కార్మికుడితో మాకు సంబంధం లేదు” అంటూ యాజమాన్యం మృతదేహం తరలింపు ఖర్చును భరించేందుకు నిరాకరించింది. సాధారణంగా అందే ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) సహాయం కూడా నిధుల కొరత కారణంగా అందలేదని, రూ.1.50 లక్షలు చెల్లించాలని మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ కుటుంబానికి సూచించింది. ఆ మొత్తం చెల్లించలేని పరిస్థితిలో ఓమాన్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని తెలియజేశారు.
ఈ పరిస్థితుల్లో మృతుడి భార్య తోగరి చిన్న సావిత్రి, కుమారుడు సంజయ్, గ్రామ సర్పంచ్ బేగారి సాయిలుతో కలిసి 13-01-2026న హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. దీనికంటే ముందే ఆమె సీఎంఓకు ఈ-మెయిల్ ద్వారా కూడా విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జీఏడి ఎన్నారై విభాగం ఇండియన్ ఎంబసీకి వైర్ మెసేజ్ పంపింది.
ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జి. చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సమస్య తీవ్రతను గుర్తించిన ఆయన తక్షణ చర్యలకు ఆదేశించారు.
ఐఏఎస్ అధికారిణి మానవీయ స్పందన
ఈ కేసును సీఎం ప్రజావాణి నోడల్ అధికారి, ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ పరిశీలించి, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని వెంటనే స్పందించారు. నెలరోజులుగా ఆసుపత్రి శవాగారంలో మృతదేహం ఉండిపోవడం, భర్త పార్థివదేహం కోసం గ్రామం నుంచి హైదరాబాద్ వరకు వచ్చిన భార్య పరిస్థితి ఆమెను చలింపజేసింది.
ఫలితంగా, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1.50 లక్షలను కొన్ని గంటల వ్యవధిలోనే చెక్కుగా జారీ చేసి, మృతుడి భార్య చిన్న సావిత్రికి అందజేశారు. ఓమాన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్–తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్ సమన్వయం చేస్తూ సహకరించారు.
ఈ మానవీయ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డిని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ బేగారి సాయిలు, మంద భీంరెడ్డి తదితరులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన మానాల మోహన్ రెడ్డి, అనిల్ ఈరవత్రి, నాగేపూర్ మహిపాల్ రెడ్డి లకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని Latest News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


