Telangana Sankranti Toll-Free Travel:
సంక్రాంతి పండగను పురస్కరించుకుని స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది. పండగ రోజుల్లో జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి టోల్ ఫీజు భారం లేకుండా చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇవాళ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుండగా, సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ముఖ్యంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65)పైని పంతంగి, కొర్లపాడు టోల్‌ప్లాజాల వద్ద సంక్రాంతి సమయంలో తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతుంటాయి. ఈ సమస్యను తగ్గించి ప్రయాణికులు సాఫీగా స్వగ్రామాలకు చేరుకునేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ఇందుకోసం సంక్రాంతి రోజుల్లో టోల్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరించే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది.
ఈ నిర్ణయం అమలైతే ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, విజయవాడ తదితర మార్గాల్లో ప్రయాణించే వేలాది మందికి లాభం చేకూరనుంది. అయితే జాతీయ రహదారుల టోల్ అంశంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం కావడంతో, సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలోనే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే సంక్రాంతి ప్రయాణం మరింత సుఖమయం కానుంది.
మరిన్ని Latest News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


