Singapore Telugu Samajam: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ( Singapore Telugu Samajam )ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొని అక్కడ నివసిస్తున్న తెలుగు వారిని కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా భరతమాత గౌరవాన్ని పెంచాలి అనే శ్రీ రాయప్రోలు వారి స్ఫూర్తితో, సింగపూర్‌లోని తెలుగువారు తమ భాషా–సంస్కృతులను కాపాడుకుంటూనే, అక్కడి అభివృద్ధిలో భాగస్వాములు కావడం ప్రశంసనీయమని ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఈ స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన సింగపూర్ తెలుగు సమాజం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
భాషా సంస్కృతుల పరిరక్షణపై సందేశం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “భాష అంటే మాట్లాడే నాలుగు పలుకులు మాత్రమే కాదు. మన భాషలో మన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం దాగి ఉన్నాయి. మాతృభాష ప్రతి ఒక్కరి ఇంటి భాష కావాలి” అని పేర్కొన్నారు.
మన కట్టు–బొట్టు, భాష, ప్రాస, యాస, గోస, అలాగే మన పద్యం, గద్యం, పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు ఎప్పటికీ విడువరాదని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన భాషా–సంస్కృతులను గౌరవిస్తూ శ్రద్ధగా జరుపుకోవాలని సూచించారు.
భాషా సంస్కృతులను కాపాడుకోవడమే కాకుండా, సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. విదేశాల్లో కష్టపడి సంపాదించి, తిరిగి భారతదేశానికి వచ్చి దేశ సేవ చేయాలని ఆకాంక్షిస్తూ, అక్కడున్న తెలుగు వారందరినీ సాదరంగా భారతదేశానికి ఆహ్వానిస్తున్నానని ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు.
మరిన్ని National News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


