Hyderabad City Police retirement: 21 మంది పోలీసు అధికారులకు ఘన పదవీ విరమణ వీడ్కోలు
హైదరాబాద్: హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో పదవీ విరమణ పొందిన 21 మంది పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్ ఐపీఎస్ గారు పాల్గొని, పదవీ విరమణ పొందుతున్న అధికారులను సత్కరించి అభినందనలు తెలిపారు.
పదవీ విరమణ పొందినవారిలో 1 ఇన్‌స్పెక్టర్, 7 సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 10 అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 1 హెడ్ కానిస్టేబుల్, 2 ఎల్‌జీఎస్ సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి తెలంగాణ ఉద్యమం, కోవిడ్ మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పోలీసులు అంకితభావంతో పనిచేశారని ప్రశంసించారు. వారి సేవల ఫలితంగానే నేడు రాష్ట్రం ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు.
సుమారు 35 నుంచి 44 సంవత్సరాల పాటు పోలీసు శాఖకు సేవలు అందించడం గర్వకారణమని, ఇంత అనుభవం ఉన్న అధికారులు పదవీ విరమణ చేయడం బాధాకరమే అయినప్పటికీ, ఇది జీవితంలో సహజమైన ప్రక్రియ అని అన్నారు. పదవీ విరమణ అనంతరం ‘సెకండ్ ఇన్నింగ్స్’లో కుటుంబంతో సమయం గడుపుతూ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అలాగే పదవీ విరమణ నిధులను ప్రభుత్వ సంస్థలైన బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే పెట్టుబడులు పెట్టాలని, అధిక లాభాల పేరుతో మోసాలకు గురికావద్దని హితవు పలికారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసు శాఖకు వారు అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ (అడ్మిన్) శ్రీమతి కె. వెంకటలక్ష్మి, సీఏఓ శ్రీ శ్రీనివాసులు, పోలీసు అధికారుల సంఘం సెక్రటరీ ఆసిఫ్ ఖాన్తో పాటు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


