Akkene Palli Sammakka Saralamma Jatara: అక్కెనపల్లిలో సమ్మక్క–సారలమ్మ జాతర
రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం అక్కెనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మ జాతరలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
సమ్మక్క–సారక్క కమిటీ సభ్యులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, విద్యార్థి యువకులకు, వివిధ గ్రామాల నుంచి హాజరైన ప్రజలందరికీ జాతర శుభాకాంక్షలు తెలిపారు. గతంలో అక్కెనపల్లిలో కరెంటు, లైట్లు, తాగునీటి సౌకర్యాలు కూడా లేవని గుర్తు చేస్తూ, ఒక్కొక్కటిగా అన్ని సదుపాయాలు అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.
మేడారం వెళ్లలేని పరిస్థితుల్లో ఇక్కడే జాతర జరుపుకుంటున్నామని, అమ్మవారి దయతో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, వారి మొక్కులు నెరవేరాలని ఆకాంక్షించారు. సమ్మక్క–సారలమ్మ జాతర అక్కెనపల్లిలో జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
సమ్మక్క–సారక్క అమ్మవారి దయ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, పసిడి పంటలు పండుతున్నాయని తెలిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కెసిఆర్ పాలనలో యూరియా కొరత లేదని, ప్రస్తుతం యూరియా దొరకడం లేదని అన్నారు.
కెసిఆర్ పాలనను స్వర్ణయుగంగా అభివర్ణించిన హరీశ్ రావు, నాట్లకు నాట్లకు రైతుబంధు అందేదని, ఇప్పుడు ఓట్లకు మాత్రమే రైతుబంధు వస్తోందని ఆరోపించారు. ఫిబ్రవరి వచ్చినా రైతుబంధు రాలేదని, యూరియా, వడ్ల బోనస్, కరెంటు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు.
బోర్ల దగ్గరే రైతులు పడుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ హయాంలో చెక్ డ్యామ్‌లు, కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎండాకాలంలో కూడా నీరు అందుతుందని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని, భూముల ధరలు పడిపోయాయని విమర్శించారు. ప్రశ్నిస్తున్నందుకే నోటీసులు పంపుతున్నారని ఆరోపిస్తూ, కెసిఆర్‌కు నోటీసులు ఇవ్వడం సూర్యునిపై ఉమ్మేసినట్టేనని వ్యాఖ్యానించారు. ఎన్ని నోటీసులైనా పంపొచ్చని, ప్రశ్నించడం ఆపబోమని స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


