Mahabubnagar IIIT : విద్యే జీవితాన్ని మార్చగల శక్తి – విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్బోధన
“లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. అందుకు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. భాషను, జ్ఞానాన్ని పెంచుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేయాలి. నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన విద్య మిమ్మల్ని సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుంది” అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యార్థినీ విద్యార్థులకు ఉద్బోధించారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) కు ముఖ్యమంత్రి గారు భూమిపూజ చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, వారు ప్రస్తావించిన అంశాలకు స్పందిస్తూ విద్య ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధినే ప్రభుత్వ టాప్ ప్రాధాన్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేస్తున్నామని, మహబూబ్‌నగర్ జిల్లాలో IIITతో పాటు ఇంజినీరింగ్, లా, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. యూపీఎస్సీ సివిల్స్ రాసే యువతను ప్రోత్సహించేందుకు మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.
“ప్రభుత్వం ఇవ్వగలిగిన గొప్ప వరం విద్య మాత్రమే. విద్య ఒక్కటే మీ జీవితాన్ని మార్చగలదు. 25 ఏళ్ల వరకు కష్టపడి చదువుకోండి. చదువు మీకు గౌరవాన్ని ఇస్తుంది. తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి” అని విద్యార్థులకు సూచించారు.
స్వాతంత్య్రం తర్వాత భూమిలేని పేదలకు భూములు పంచిన చరిత్రను గుర్తు చేస్తూ, ప్రస్తుతం పేదలకు ఇవ్వగలిగిన ప్రధాన సాధనం విద్యేనని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తుచేస్తూ, 75 ఏళ్ల తర్వాత జిల్లాకు మళ్లీ ఆ అవకాశం రావడం గర్వకారణమన్నారు. ఈ రోజు భూమిపూజ చేసిన రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న IIIT భవనాన్ని ఏడాది కాలంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు ఎలాంటి తొణుకు లేకుండా ధైర్యంగా మాట్లాడి అందరి ప్రశంసలు పొందారు. భూమిపూజ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీలు మల్లురవి, అరుణ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


