Mancherial District: చెన్నూరు పట్టణంలో బీసీ బాలికల కళాశాల, వసతి గృహం ప్రారంభం
కొల్లూరు గ్రామంలో గోదావరి ఇసుక రీచ్ ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో బీసీ బాలికల కోసం నిర్మించిన కళాశాల మరియు వసతి గృహాన్ని రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి గారు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు భద్రమైన వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని, బీసీ బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.
అనంతరం కోటపల్లి మండలంలోని కొల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను మంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక ప్రజల నిర్మాణ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గోదావరి నుంచి తీసుకొచ్చే ఇసుకను తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
ఇసుక అక్రమ రవాణా, దందాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరిస్తూ, ఇసుక దందాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


