KCR New Year wishes: తెలంగాణ ప్రజల సుఖసంతోషాల కోసం
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు చిత్తశుద్ధితో, రాజీలేని పోరాటం కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీ, నూతన సంవత్సరంలో రెట్టించిన పట్టుదలతో ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన సందేశంలో, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ, సాగునీటి రంగాలు గాడినపడి మరింత అభివృద్ధి చెందాలని, రైతాంగం ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు. అలాగే మహిళలు, కార్మికులు, యువత సహా సకల జనులు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఎప్పటికీ ముందుంటుందని, ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని కేసీఆర్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


