BRS Protest: సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన శాంతియుత ర్యాలీ
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే తమ ఏడవ గ్యారంటీ అని చెప్పిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసుల ద్వారా అణచివేస్తూ నిరంకుశ పాలనకు ఉదాహరణగా మారుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు.
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం చేపట్టిన గాంధేయ మార్గంలోని శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకుని, పలువురు కార్యకర్తలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
శాంతియుతంగా జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలను అరెస్టులతో అణచివేయాలని చూడటం అనైతికమని బీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేశారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, నిర్బంధాలకు భయపడేది లేదని స్పష్టం చేస్తూ, చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


