Bum Rukn ud Daula lake: ఆకట్టుకుంటున్న బమ్–రుక్న్–ఉద్–దౌలా చెరువు
అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ , పండగ తర్వాత ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశం
హైదరాబాద్: పాతబస్తీలోని చారిత్రక బమ్–రుక్న్–ఉద్–దౌలా చెరువు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటూ నగరవాసులను ఆకట్టుకుంటోంది. చెరువు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోవడంతో, హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ మంగళవారం రాత్రి స్వయంగా పరిశీలించారు.
దాదాపు రెండు కిలోమీటర్ల పొడవున్న చెరువు గట్టు వెంట నడుచుకుంటూ అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్, పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుని, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థను పరిశీలించిన ఆయన, పరిసరాలు మరింత స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళలు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్న నేపథ్యంలో, వారికి అనుకూలంగా ఉండే వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు.
అలాగే చెరువు చరిత్రను వివరించేలా ప్రవేశ ద్వారం వద్ద శిలాఫలకాన్ని అభివృద్ధి చేయాలని, ఔషధ గుణాలు కలిగిన నీటితో నిజాం కాలంలో ఖ్యాతిగాంచిన ఈ చెరువు చుట్టూ మెడిసినల్ ప్లాంట్స్ నాటాలని సూచించారు.
పిల్లలు, పెద్దలు భద్రంగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో సమయం గడిపేలా చెరువు పరిసరాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి పండగల అనంతరం చెరువును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


