Hyderabad CURE project: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించిన నేపథ్యంలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో పౌర సేవలకు కొత్త దిశగా పునరంకితమవుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో చెత్త నిర్వహణ అత్యంత కీలకమని పేర్కొన్న సీఎం, ఈ విషయంలో ఎలాంటి అలసత్వం తగదని హెచ్చరించారు. జోనల్ కమిషనర్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని, చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి రక్షించాలని సూచించారు.
CURE పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టాలని, కాలుష్య నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు.
జనన–మరణ ధ్రువీకరణలు, ట్రేడ్ లైసెన్సులు వంటి పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగం, పారదర్శకత పెంచాలని సూచించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, వచ్చే ఐదేళ్లకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


