Vijayoshtu Letter : జనగామలో విద్యార్థులకు ప్రేరణ | ‘విజయోస్తు’ లేఖ అందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ: పదవ తరగతి పరీక్షలకు ప్రతి విద్యార్థి పక్కా యాక్షన్ ప్లాన్‌తో సిద్ధమై మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ వసతి గృహాల్లోని 10వ తరగతి విద్యార్థుల కోసం 2025–26 వార్షిక పరీక్షలపై ప్రేరణ–అవగాహన తరగతులను స్థానిక గీతాంజలి పాఠశాలలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ముందుగా విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పరీక్షించి, అవగాహన తరగతులు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశపడుతున్నారని, ఆ ఆశయాన్ని నిజం చేయడానికి విద్యార్థులు పట్టుదలతో చదవాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వంటిదని, ఇందులో మంచి మార్కులు సాధిస్తే లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత చదువులకు వెళ్లొచ్చన్నారు.
ప్రతి రోజు సామర్థ్యాలను పెంపొందించుకోవాలని, ‘విజయోస్తు 2.0’ మెటీరియల్‌ను క్షుణ్ణంగా చదవాలని, అన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించే విధంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను ఒకటికి రెండు సార్లు సాధన చేయాలని చెప్పారు.
ఆరోగ్య సమస్యల కారణంగా పరీక్షలకు దూరంగా ఉండవద్దని, ప్రతి పరీక్ష కేంద్రంలో మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏ సబ్జెక్ట్‌ను గైర్హాజరు కాకుండా అన్ని పరీక్షలను హాజరు కావాలని సూచించారు.
ప్రతి మండలంలో అత్యధిక మార్కులు సాధించిన టాపర్లకు సైకిల్ బహుకరిస్తామని ప్రకటించారు. తాను పదవ తరగతిలో ఎలా సిద్ధమయ్యానో విద్యార్థులతో పంచుకుంటూ, చదివే సమయంలో చదవడం, భోజనం సమయంలో భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం వంటి క్రమశిక్షణ జీవితం మొత్తం ఉపయోగపడుతుందని తెలిపారు.
పరీక్షలు సమీపిస్తున్నందున ప్రతి రోజును సద్వినియోగం చేసుకోవాలని, కష్టంగా భావించే సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రివైజ్, ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్, చేతిరాత వంటి అంశాలు కీలకమని వివరించారు. పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పరీక్షలను ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని ప్రోత్సహిస్తూ, తాను స్వయంగా రాసిన ‘విజయోస్తు’ లేఖను విద్యార్థులకు అందజేసి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, హిందీ తదితర సబ్జెక్టులపై గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో DSDO, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


