Mandal Reorganisation: మండలాలు–జిల్లాల పునర్వవస్థీకరణపై ఉన్నతస్థాయి కమిషన్ ఏర్పాటు
సంక్రాంతి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల
ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి ప్రకటన
మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వవస్థీకరణపై రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో వాటిపై సమగ్ర అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రూపొందించిన 2026 డైరీ, క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేసినట్టు వెల్లడించారు.
ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, మండలాలు, జిల్లాల మార్పులపై వస్తున్న డిమాండ్లను తొందరపాటు నిర్ణయాలతో కాకుండా, ప్రజాభిప్రాయం ఆధారంగా శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకోసం ఏర్పాటు చేయబోయే కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తరహాలోనే ప్రజల అభిప్రాయాలను సేకరించి నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. ఆ నివేదికను అసెంబ్లీ ముందు ఉంచి చర్చించిన తర్వాతే రేషనలైజేషన్‌పై మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ఉద్యోగుల బెనిఫిట్స్‌కు సంబంధించి సుమారు రూ.11 వేల కోట్ల బకాయిలు, కాంట్రాక్టర్లకు రూ.40 వేల కోట్ల బకాయిలు, సింగరేణి, విద్యుత్ సంస్థలకు సంబంధించిన బకాయిలతో కలిపి మొత్తం రూ.1.11 లక్షల కోట్ల బకాయిలు, బ్యాంకు రుణాలతో కలిపి సుమారు రూ.8.11 లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రంపై ఉందని వివరించారు. ఈ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలియజేసేందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టామని తెలిపారు.
ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది లక్షలాది ఉద్యోగులేనని, ప్రభుత్వానికి సమాజంలో గౌరవం ఉందంటే దానికి ప్రధాన కారణం ఉద్యోగులేనని ముఖ్యమంత్రి కొనియాడారు. సంక్షేమ పథకాలను పేదల వరకు చేర్చే సారధులు ఉద్యోగులేనని అన్నారు. గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వచ్చేవో, ఇప్పుడెప్పుడు వస్తున్నాయో ఉద్యోగులే గమనించాలని పేర్కొన్నారు.
డీఏ విడుదల వల్ల ప్రభుత్వంపై ప్రతి నెలా సుమారు రూ.225 కోట్ల భారం పడుతుందని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆరోగ్య భద్రత, ఉద్యోగ సంఘాల కార్యాలయాల నిర్మాణంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు ఎంత నిధులు సమకూర్చితే అంత మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంట్‌గా ప్రభుత్వం అందిస్తుందని, రాష్ట్ర స్థాయిలో గెజిటెడ్ అధికారుల కార్యాలయానికి స్థలం కేటాయిస్తామని తెలిపారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, పదవీ విరమణ బెనిఫిట్స్ ఉద్యోగుల హక్కులని పేర్కొన్నారు. ఆదాయం పెంచేందుకు కొత్త పన్నులు విధించడం లేదని, పన్ను ఎగవేతలను అరికట్టి ఆదాయం పెంచి సంక్షేమ పథకాలు, ఉద్యోగుల బెనిఫిట్స్ సమయానికి చెల్లిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
“ఈ ప్రభుత్వం మనందరిదీ. ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


