Jagtial government hospital negligence: జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది.
జగిత్యాల జిల్లా జైనా గ్రామానికి చెందిన రాజ నర్సయ్య అనే వ్యక్తి ప్రమాదానికి గురై కాలుకు తీవ్ర గాయం కావడంతో విరిగిన స్థితిలో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆయన్ను అత్యవసరంగా అంబులెన్స్‌లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆసుపత్రికి చేరుకున్న తర్వాత అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ అరగంటకు పైగా సిబ్బంది పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది స్పందించకపోవడంతో బాధితుడు తీవ్ర వేదనకు గురయ్యాడు.
బాధితుడి బాధను చూడలేక చివరకు అతని కోడలు స్వయంగా స్ట్రెచర్‌పై తీసుకొని ఆసుపత్రి లోపలికి వెళ్లిన దృశ్యాలు అక్కడి వారిని కలిచివేశాయి.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చినా సిబ్బంది స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వైద్య సిబ్బంది తీరుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


