Kukatpally Sub-Registrar’s office: కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం శంకుస్థాపనకు సంబంధించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఏరియా అత్యధిక జనసాంద్రతతో కాంక్రీట్ జంగల్‌గా మారిందని, ప్రజలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు సేదతీరేందుకు పార్కులు అత్యవసరమని పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో మిగిలిన స్థలాలను కబ్జా చేయకుండా లేదా వేలం వేయకుండా పార్కులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే, 40–50 ఏళ్ల క్రితం ఏర్పడిన లే అవుట్‌లలోని పార్క్ స్థలాలు, స్కూల్ స్థలాలను బై నంబర్లతో కబ్జా చేస్తున్నారని, దీనిపై సమగ్ర తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు.
సివిల్ తగాదాలు, భూ పంచాయతీలకు పోలీస్ స్టేషన్లు అడ్డాలుగా మారడం సరికాదని, ఈ బాధ్యతను రెవెన్యూ శాఖే నిర్వర్తించాలన్నారు. నకిలీ డాక్యుమెంట్ల సృష్టి ద్వారా పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటే మంత్రిగారికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.
పేదల భూములకు ప్రభుత్వం రక్షణగా నిలవాలని, ఇలాంటి భూముల విషయంలో కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన “ఏక్ సాల్ పట్టా” భూములపై బ్రోకర్లు కబ్జాలు పెట్టిన విషయంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. నిజమైన పేదలు నివసిస్తున్న భూముల విషయంలో వారికి నష్టపరిహారం చెల్లించి భూములు సేకరించాలని, వారిని తరిమివేయవద్దని సూచించారు.
HMT, IDPL భూముల్లో 60 గజాల్లో పేదలు కట్టుకున్న ఇళ్లను కూలగొట్టవద్దని, బడాబాబులు అక్రమంగా ఆక్రమించిన భూములపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలపై మాత్రమే చర్యలు, పెద్దలపై నిర్లక్ష్యం అన్న భావన ప్రజల్లో కలుగుతోందని తెలిపారు.
ఈ అంశాలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ, ప్రీ-బుకింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న పెద్ద కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేశారు.
DSR నిర్మాణ సంస్థకు శుభాకాంక్షలు తెలుపుతూ, CSR నిధులతో ప్రజాసేవ కార్యక్రమాలు చేపట్టాలని, అలా చేస్తే మంచి పేరు శాశ్వతంగా నిలుస్తుందని అన్నారు.
అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి, అందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తూ ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పినందుకు మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
కూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు,
శాసన మండలి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు,
ఎమ్మెల్సీ శ్రీ నవీన్ రావు గారు,
జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు,
స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజి శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు,
డిఎస్ఆర్ నిర్మాణ సంస్థ అధినేత శ్రీ సుధాకర్ రెడ్డి గారు
తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


