Health ATM : నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.30 లక్షలతో హెల్త్ ఎటిఎం, ఈసీజీ మిషన్ ప్రారంభం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, IDBI బ్యాంక్ CSR నిధులతో నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హెల్త్ ఎటిఎం – ప్రైమ్ టేర్ మిషన్ మరియు ఈసీజీ మిషన్‌ను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
ఈ హెల్త్ ఎటిఎం ద్వారా ఈసీజీ, రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర స్థాయి (బ్లడ్ షుగర్), పల్స్, ఆక్సిజన్ సాచ్యురేషన్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను తక్కువ సమయంలో నిర్వహించవచ్చు. పరీక్షల ఫలితాలు డిజిటల్ రూపంలో వెంటనే లభించడం వల్ల వైద్యులు త్వరితగతిన సరైన చికిత్స అందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
ప్రివెంటివ్ హెల్త్ కేర్‌ను బలోపేతం చేస్తూ, హృదయ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడంలో ఈసీజీ మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చి, సామాన్య ప్రజల ఆరోగ్య భద్రతను మరింత పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ప్రజారోగ్యానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఇలాంటి సౌకర్యాలు మరిన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


