Mela Cheruvu: FTL పరిధిలో అక్రమ మట్టిపోకలపై కఠిన చర్యలు
సంగారెడ్డి జిల్లా | రామచంద్రాపురం మండలం | తెల్లాపూర్: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ పరిధిలోని మేళ చెరువులో హైడ్రా (HYDRAA) అధికారులు అక్రమ మట్టిపోకలు, ఆక్రమణలపై కఠిన చర్యలు చేపట్టారు. చెరువు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో మట్టి పోసి భూమి స్వరూపాన్ని మార్చిన ప్రాంతాలను గుర్తించిన హైడ్రా, అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తోంది.
చెరువులోకి నీరు ప్రవేశించకుండా అడ్డుగా నిర్మించిన గోడలను తొలగిస్తూ, సహజ జలప్రవాహాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టింది. దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
హైడ్రా ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి వేల లారీల మట్టి, బండరాళ్లు చెరువులో నింపినట్టు నిర్ధారించారు. చెరువు FTL పరిధిలోని భూమిలో పంటలు పండించుకోవడానికి మాత్రమే అనుమతి ఉండగా, భూమి స్వరూపాన్ని మార్చేలా మట్టి నింపడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు హైడ్రా హెచ్చరించింది. అదే సమయంలో, వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


