Fire Safety Hyderabad: నిబంధనలు ఉల్లంఘించిన 6 ఫర్నీచర్ షాపులు సీజ్
హైదరాబాద్: నగరంలో అగ్ని ప్రమాదాల పెరుగుతున్న నేపథ్యంలో ఫైర్ సేఫ్టీపై హైడ్రా రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగించింది. శుక్రవారం GHMC, హైడ్రా, ఫైర్ సర్వీసెస్, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఫైర్ నిబంధనలను పాటించకుండా షాపులు నిర్వహిస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. సెల్లార్లను అక్రమంగా గోదాములుగా మార్చి భారీగా నిల్వలు ఉంచడాన్ని అధికారులు సీరియస్‌గా పరిగణించారు. కెమికల్స్, పెయింట్ డబ్బాలు, పరుపులు, బ్యాటరీలు, ఫర్నీచర్ తయారీ సామగ్రిని అధికంగా నిల్వ ఉంచడం అగ్ని ప్రమాదాలకు దారి తీస్తుందని అధికారులు హెచ్చరించారు.
తనిఖీల్లో పలు భవనాల్లో భవన అనుమతులు, ఫైర్ ఎన్‌వోసీలు లేకపోవడం గుర్తించారు. ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్లు, స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేని పరిస్థితులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మొత్తం 6 ఫర్నీచర్ షాపులను అధికారులు సీజ్ చేశారు.
హైడ్రా అధికారులు మాట్లాడుతూ…
షాపులున్న భవనాలను గోదాములుగా మార్చరాదని, గోదాములను వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని షాపుల్లో కేవలం ఫర్నీచర్ ప్రదర్శన, అమ్మకాలు మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేశారు.
సీజ్ చేసిన షాపుల వివరాలు:
-
గచ్చిబౌలి: లుకింగ్ గుడ్ ఫర్నీచర్ షాప్
-
సెల్లార్లలో పెయింట్ డబ్బాలు, పరుపులు, బ్యాటరీలు భారీగా నిల్వ
-
భవన అనుమతులు, ఫైర్ అనుమతులు లేవు
-
సెల్లార్ ర్యాంపులు మూసి అక్రమ నిల్వలు
-
-
కొంపల్లి క్రాస్ రోడ్స్: అను ఫర్నిచర్ షోరూం
-
కూకట్‌పల్లి: రోయల్ ఓక్ ఫర్నీచర్ షోరూం
-
అత్తాపూర్: పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రోయల్ ఓక్ ఫర్నీచర్
-
ఉప్పల్ నాగోల్: బాంటియా ఫర్నీచర్ షోరూం
-
నాచారం: అను ఫర్నీచర్ షోరూం
ఈ షాపుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, “ఫైర్ సేఫ్టీ లేని ప్రాంతం” అనే హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
అగ్ని ప్రమాదాలను నివారించేందుకు తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


