చెరువుల్లో మట్టిపోసడంపై హైడ్రా ఆగ్రహం – ఆక్రమణలపై కఠిన చర్యలు: HYDRA Commissioner AV Ranganath
చెరువుల FTL (ఫుల్ ట్యాంక్ లెవెల్), బఫర్ జోన్ పరిధిలో మట్టి పోసి చెరువుల స్వరూపాన్ని మార్చడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణించింది. ఈ చర్యలపై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. చెరువుల్లో మట్టిపోసే అవకాశం లేకుండా అన్ని చెరువులకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే అక్రమంగా మట్టి పోసిన వారితోనే ఆ మట్టిని తొలగించించి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
చెరువుల FTL, బఫర్ పరిధిలో మట్టి పోసి నింపుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు, గండిపేట చెరువులను హైడ్రా కమిషనర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేళ్ల చెరువు FTL పరిధిలో మట్టి పోయడాన్ని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురావడంతో, వెంటనే ఆ మట్టిని తొలగించాలని రాజు యాదవ్ను ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అలాగే గండిపేట చెరువులో హిమాయత్‌నగర్ విలేజ్ వైపు మట్టి పోసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్, ఆ మట్టిని వెంటనే తొలగించాలని డా. ఖుర్షీద్ను ఆదేశించారు. 48 గంటల్లో తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, వారి విజ్ఞప్తి మేరకు అదనంగా 24 గంటల గడువు ఇచ్చారు. చెరువుల స్వరూపాన్ని మార్చితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్‌లో పార్కు ఆక్రమణల తొలగింపు
జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–36 పరిధిలోని రోడ్డు నంబర్ 32లో ఉన్న రెండు ఎకరాలకు పైగా విస్తీర్ణం గల పార్కులో జరిగిన ఆక్రమణలను జీహెచ్‌ఎంసీతో కలిసి హైడ్రా తొలగించింది. మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, వెంటనే ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు.
పార్కుకు ఆనుకుని ఉన్న ఇళ్లవారు వాచ్‌మ్యాన్, ఆవుల కోసం అక్రమంగా షెడ్లు నిర్మించడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కులోకి గేట్లు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టి, వాటిని వెంటనే తొలగించి ప్రహరీ నిర్మాణం, ప్రధాన గేట్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని సూచించారు. ఆక్రమణల తొలగింపుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
బుల్కాపూర్ నాలా పునరుద్ధరణకు చర్యలు
హుస్సేన్ సాగర్‌కు వర్షపు నీటిని తీసుకువచ్చే చారిత్రక బుల్కాపూర్ నాలాను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ అధికారులకు సూచించారు. మణికొండ ప్రాంతంలో నాలా ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కమిషనర్ పరిశీలన చేపట్టారు.
శంకరపల్లి బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట, నార్సింగ్, పుప్పలగూడ, మణికొండ, దర్గా, షేక్‌పేట్, టోలిచౌకి, పోచమ్మ బస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్ సాగర్‌కు వర్షపు నీటిని తీసుకెళ్లే ఈ నాలా పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరుగుతాయని కమిషనర్ పేర్కొన్నారు. నాలా ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


