HYDRAA Commissioner AV Ranganath: పేదల ఇళ్లకు హైడ్రా భరోసా
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: పేదల ఇళ్లపై ఎలాంటి చర్యలు ఉండవని హైడ్రా (HYDRAA) కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ (HYDRAA Commissioner AV Ranganath)స్పష్టమైన భరోసా ఇచ్చారు. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామం, సర్వే నంబర్ 307లో ప్రభుత్వ భూమిలో ఇళ్లుకట్టుకుని నివసిస్తున్న పేదలపై వదంతులు వ్యాపించడంతో, బుధవారం కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ నివాసితులతో నేరుగా మాట్లాడి, ఇప్పటికే నివసిస్తున్న పేదలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేయించమని తేల్చిచెప్పారు.
పేదల ఇళ్లను మినహాయించి మిగిలిన ప్రభుత్వ భూమిని కాపాడతామని తెలిపారు. హైడ్రా పేరు చెప్పి ఎవరైనా మోసాలకు పాల్పడితే నేరుగా హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. అదే సమయంలో సర్వే నంబర్ 307లో కొత్తగా ఇళ్ల నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదే సందర్భంగా ప్రగతినగర్ (అంబీర్ చెరువు) పరిసరాల్లోని చిరు వ్యాపారుల సమస్యలపై స్పందించిన కమిషనర్, చెరువు రక్షణలో భాగంగా చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం చూపించి తరలించాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాల్లో చెత్త గుట్టలను ఇప్పటికే సుమారు 150 లారీల వరకు తరలించామని వెల్లడించారు. చెరువులను పరిరక్షిస్తూ ప్రజల జీవనోపాధికి భంగం కలగకుండా సమతుల్య చర్యలు చేపడతామని హైడ్రా స్పష్టం చేసింది.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


