Bachupally HYDRA: రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలంలోని గ్రామంలో 2.30 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. అదే ప్రాంతంలో ఎమ్మార్వో కార్యాలయానికి కేటాయించిన 30 గుంటల ప్రభుత్వ భూమిని కూడా అక్రమ కబ్జాల నుంచి విడిపించింది.
సర్వే నంబర్లు 142, 143, 144లలో ఉన్న ఈ 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో అప్పటి జిల్లా కలెక్టర్ పార్కు అభివృద్ధి కోసం కేటాయించారు. ఈ స్థలంలో మొక్కలు నాటి, అర్బన్ నర్సరీ ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందించారు. బోర్వెల్, వాటర్ సంప్, వాచ్మన్ గది, ఇనుప గేట్లు, ఫెన్సింగ్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.
అయితే 2023లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు పార్కులోని మొక్కలను ధ్వంసం చేసి నర్సరీని తొలగించారు. తమదే భూమి అంటూ రాత్రికి రాత్రే ప్రహరీ నిర్మించారు. ఈ ఘటనపై ప్రజావాణిలో ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. పరిశీలనలో ఇది పూర్తిగా పార్కు స్థలమేనని నిర్ధారించారు.
హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు మంగళవారం అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, హైడ్రా బోర్డులను స్థాపించారు.
అదేవిధంగా అదే సర్వే నంబర్లలో ఎమ్మార్వో కార్యాలయానికి కేటాయించిన 30 గుంటల భూమి కూడా కబ్జాకు గురికాగా, అక్కడి అక్రమాలను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.
పార్కు స్థలాన్ని రక్షించడంతో బాచుపల్లి ప్రాంతవాసులు హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రా, ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


