Ande Sri Smriti Vanam: అందెశ్రీ గారి అంత్యక్రియలు జరిగి 45 రోజులు
తెలంగాణ లోకకవి అందెశ్రీ గారి అంత్యక్రియలు జరిగి 45 రోజులు గడిచినా ఇప్పటివరకు ఆయన స్మారక ఘాట్ లేదా స్మృతి వనం నిర్మించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ తీరును బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ కాంటెస్టేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఆదివారం ఘాట్కేసర్ రింగురోడ్డు వద్ద అందెశ్రీ గారి అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
“అందెశ్రీ గారి పాడే మోసిన చేతులకు గౌరవంగా స్మృతి వనం ఏర్పాటు చేయకపోతే లక్షలాది తెలంగాణ ప్రజల చేతులు ఉక్కు పిడికిలిలవుతాయి” అని హెచ్చరించారు.
అంత్యక్రియల సమయంలో మీడియా ప్రచారం కోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా వేయకపోవడం దారుణమని విమర్శించారు. తెలంగాణ కళాకారులు, కవులను గౌరవిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ మాటలు గాలి మేడలుగా కూలిపోయాయని మండిపడ్డారు.
గద్దె నెక్కేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా విస్మరించారో, అలాగే దళిత కవి అయిన అందెశ్రీ గారి విషయంలోనూ రేవంత్ సర్కార్ వివక్షత చూపుతోందని ఆరోపించారు.
“దళిత కవిపట్ల ఈ విధమైన నిర్లక్ష్యం అన్యాయం” అని స్పష్టం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి అందెశ్రీ గారి స్మృతి వనం ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


