Indiramma Houses: ధర్మపురిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన
నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సంబంధిత అధికారులు చేపడుతున్న పనుల పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి లబ్ధిదారుడికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సకాలంలో అందుబాటులో ఉండేలా జగిత్యాల ప్రాంతంలో ప్రభుత్వ ఇసుక బజార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని లబ్ధిదారులకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులకు సూచించారు.
ఇటుక, కంకర, బేస్మెంట్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు లబ్ధిదారులకు అనుకూలంగా ఉండేలా ధరల నియంత్రణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు వెనుకబడి ఉన్న చోట వెంటనే వేగం పెంచి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు లక్ష్యాలను పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత కొలతలతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. సకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునేందుకు అవసరమైన మేస్త్రీలు, కార్మికులను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే ఐకేపి, మెప్మా సహకార సంఘాల ద్వారా రుణ సౌకర్యాలు పొందవచ్చని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు దశలవారీగా ఆధార్ లింక్ చేయబడిన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయబడతాయని కలెక్టర్ వెల్లడించారు.
అనంతరం ధర్మపురి పట్టణ కేంద్రంలోని పలు మార్కింగ్, బేస్మెంట్, స్లాబ్ లెవెల్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, హౌసింగ్ డీఈ భాస్కర్, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంపిడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


