Telangana Global Summit – 2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 అట్టహాసంగా ప్రారంభం
ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న( Telangana Global Summit – 2025) టెలంగానా గ్లోబల్ సమ్మిట్ – 2025 ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సదస్సును అధికారికంగా ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అనేక దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు రాష్ట్ర పరిశ్రమల విస్తరణకు ప్రత్యేకమైన వేదికగా మారింది.
టెక్నాలజీ, ఇన్‌ఫ్రా, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులు
సమ్మిట్ ప్రారంభమైన కొద్దిసేపటికే పలు ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఫార్మా, బయోటెక్, గ్రీన్ ఎనర్జీ, ఇన్‌ఫ్రా డెవలప్మెంట్ వంటి రంగాల్లో భారీ MOUలు కుదిరాయి.
ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో వచ్చే 5–8 సంవత్సరాల్లో వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రారంభ దశలోనే ఈ సమ్మిట్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సంపాదించిందని అధికారులు వెల్లడించారు.
పారదర్శక పాలన–అధునాతన విధానాలే ఆకర్షణ
పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణను ఎంచుకున్న సంస్థలు రాష్ట్రంలోని పారదర్శక పాలన, ఆధునాతన పరిశ్రమల విధానాలు, సులభమైన వ్యాపార వాతావరణం, నైపుణ్యవంతమైన మానవ వనరులు తమను ఆకర్షించాయని పేర్కొన్నాయి.
ఫ్యూచర్ సిటీ రూపకల్పనలో భాగంగా అభివృద్ధి చేస్తున్న స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, గ్రీన్ టెక్ ఫెసిలిటీస్ తెలంగాణకు అదనపు మెరుగులు చేర్చనున్నాయి. ఈ కారణంగా వచ్చే నెలల్లో మరిన్ని సంస్థలు MOUలకు ముందుకు వచ్చే అవకాశముంది.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
సమ్మిట్‌లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. పరిశ్రమలు, యువత, స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఈ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి పెద్ద పుష్టినిస్తుందని, తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్టర్ల మ్యాప్‌లో అగ్రస్థానానికి తీసుకెళ్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
కొత్త పరిశ్రమలతో యువతకు అవకాశాలు
ఈ MOUల ద్వారా రాష్ట్రంలో రాబోయే సంవత్సరాల్లో లక్షలాది ప్రత్యక్ష–పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని మంత్రి వర్గం వెల్లడించింది. ముఖ్యంగా యువతకు ఆధునాతన రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.
మరిన్ని Jangaon వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


