Kumuram Bheem Asifabad Jungle Safari: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
జిల్లాలో అటవీ శాఖ – ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్న జంగిల్ సఫారీ వాహనాన్ని అటవీ వీక్షకులు వినియోగించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సఫారీ వాహనాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాల్లోని వన్యప్రాణులను సమీపంగా వీక్షించేందుకు ఈ జంగిల్ సఫారీ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పర్యాటకాభివృద్ధితో పాటు స్థానిక ఉపాధికి కూడా ఇది దోహదపడుతుందని అన్నారు.
అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ మాట్లాడుతూ, గిరిజన సంక్షేమ శాఖ – ఐటీడీఏ ఆధ్వర్యంలో జంగిల్ సఫారీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సందర్శకులకు ప్రత్యేక అనుభవం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో అటవీ పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


