Mamnoor Airport Warangal: 300 ఎకరాల భూమిని కేంద్ర విమానయాన శాఖకు అప్పగింపు – భట్టి విక్రమార్క
వరంగల్: వరంగల్ చారిత్రక కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రజా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు తెలిపారు. వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ కోసం 300 ఎకరాల భూమిని కేంద్ర విమానయాన శాఖకు అప్పగించడం తెలంగాణ విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా ఆయన పేర్కొన్నారు.
1930లో నిజాం కాలంలో నిర్మితమై, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వెలుగొందిన మామునూరు విమానాశ్రయానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ₹300 కోట్ల నిధులను కేటాయించి, దశాబ్దాలుగా కొనసాగుతున్న నిరీక్షణకు ముగింపు పలికేలా భూసేకరణ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపారు.
మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణతో వరంగల్ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టుకు సహకారం అందిస్తున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు గారికి, కేంద్ర ప్రభుత్వానికి భట్టి విక్రమార్క గారు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


