Kondapur Industrial Park Medak: 5,000 ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు
మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలోని కొండపూర్ ఇండస్ట్రియల్ పార్క్(Kondapur Industrial Park Medak )లో భారీ పెట్టుబడులతో అభివృద్ధి చేసిన పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుడ్డిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ పార్క్లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో 36 పరిశ్రమల నిర్మాణం పూర్తయ్యిందని, వీటి ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు.
ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రకటించారు. అనంతరం సచివాలయంలో కొండపూర్ పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, ఇండస్ట్రియల్ పార్క్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పరిశ్రమల ప్రారంభానికి అవసరమైన మౌలిక వసతులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ప్రధానంగా పరిశ్రమలకు ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను నెల రోజుల్లోగా పరిష్కరించాలని, అలాగే జాతీయ రహదారికి అనుసంధానించే రహదారి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిగిలిన మౌలిక సదుపాయాల పనులన్నింటినీ వేగవంతం చేసి పరిశ్రమలు త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని, పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


