Indiramma Housing Scheme: భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సహచర మంత్రులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు.
ఇండ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కనీసంగా 3,500 ఇండ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు.
పేద ప్రజల ఆర్థిక భారం తగ్గించేందుకు సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రజాహిత పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.
తాను పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం లభించిందని, త్వరలోనే రామగుండంలో పవర్ ప్లాంట్ ప్రకటన ఉంటుందని భట్టి విక్రమార్క తెలిపారు.
2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికులకు ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 5.14 లక్షల రెగ్యులర్ ఉద్యోగులకు కూడా కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం త్వరలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


