back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Newsమేడారం జాతరలో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య సేవలు – మంత్రి దామోదర్ రాజనర్సింహ

మేడారం జాతరలో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య సేవలు – మంత్రి దామోదర్ రాజనర్సింహ

Medaram Jatara: మేడారం జాతరలో స్పెషలిస్ట్ డాక్టర్లతో విస్తృత వైద్య సేవలు – అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

హనుమకొండ/మేడారం: ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారంలో జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య తలెత్తినా తక్షణమే స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

జాతర గద్దెల వద్ద ఏర్పాటు చేసిన 50 పడకల హాస్పిటల్‌, మినీ హాస్పిటల్స్‌ మరియు ప్రధాన మెడికల్ క్యాంపుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను డిప్యూట్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జాతరలో ఏర్పాటు చేసిన 3 హాస్పిటళ్లు, 30 మెడికల్ క్యాంపులు, అలాగే జాతరకు వెళ్లే ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన మరో 42 మెడికల్ క్యాంపుల్లో అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. మొత్తం 3 హాస్పిటళ్లు, 72 మెడికల్ క్యాంపుల్లో కలిపి 544 మంది డాక్టర్లు సహా 3,199 మంది సిబ్బందిని డిప్యూట్ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు.

మేడారంలో గద్దెల వద్ద 50 పడకల హాస్పిటల్‌, జంపన్న వాగు వద్ద 6 పడకల హాస్పిటల్‌, ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో మరో మినీ హాస్పిటల్ ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ వైద్యులతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 11,625 మందికి వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల కోసం 38 (108) అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్‌పై కఠిన నిఘా పెట్టాలని, నాసిరకం ఆహారం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్పిటల్స్‌, మెడికల్ క్యాంపుల లొకేషన్లు భక్తులకు స్పష్టంగా తెలిసేలా అన్ని చోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్ తక్షణమే మేడారం వెళ్లి, జాతర పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.

అత్యవసర రిఫరల్ హాస్పిటల్స్‌గా ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌, వరంగల్ ఎంజీఎంను వినియోగించాలని, ఈ హాస్పిటళ్లలో డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో సమ్మక్క–సారలమ్మ భక్తులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జాతరకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చే సమయంలో రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, నాణ్యతలేని ఆహార పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్తలు వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనారోగ్య సమస్య వస్తే వెంటనే సమీపంలోని హెల్త్ క్యాంపును సంప్రదించాలని, అవసరమైతే 108కు కాల్ చేయాలని సూచించారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles