Financial District Sewerage Plan: భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా సీవరేజ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
హైదరాబాద్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నానక్ రాం గూడ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో భవిష్యత్ సీవరేజ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను ఎండీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న మురుగు నీటి పరిమాణం, ఉన్న సీవరేజ్ లైన్లు, ట్రంక్ మెయిన్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సీవరేజ్ లైన్లు, ట్రంక్ మెయిన్ల అభివృద్ధికి మినీ సీవరేజ్ ప్లాన్‌లు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే ఇప్పటికే ఉన్న నాలాలు, వర్షపు నీటి కాలువలు, ట్రంక్ మెయిన్ల సమాచారాన్ని సేకరించి సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.
మూసీ నది, సమీప చెరువులు కలుషితం కాకుండా వర్షపు నీటి కాలువల నుంచి మురుగు నీటి పైప్ లైన్లను వేరుచేసి 2047 మాస్టర్ ప్లాన్ ఆధారంగా సీవరేజ్ ట్రంక్ మెయిన్లు, సబ్ సీవరేజ్ లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ఇందుకోసం ఓ అండ్ ఎం, ఎస్టీపీ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు.
నానక్ రాం గూడ ఎస్టీపీ క్యాచ్‌మెంట్ పరిధిలో ఉత్పన్నమయ్యే మురుగును అంచనా వేసి, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎస్టీపీ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎస్టీపీ విభాగ అధికారులను ఆదేశించారు. అలాగే గచ్చిబౌలి నుంచి కోకపేట్ పరిసర ప్రాంతాల్లో ఉత్పన్నమవుతున్న మురుగును కోకపేట్ ఎస్టీపీకి తరలించి శుద్ధి చేయడానికి సీవర్ ట్రంక్ మెయిన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
కోకపేట్ దిగువ ప్రాంతాల్లోని మురుగును సమీపంలోని చిత్రపురి, ఇబ్రహీం చెరువు ఎస్టీపీకి మళ్లించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు నానక్ రాం గూడలోని 4.5 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపీని ఎండీ సందర్శించి మురుగు శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. ఎస్టీపీ సామర్థ్యం, శుద్ధి చేసిన నీటి నాణ్యత తదితర వివరాలను తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే మురుగును ఈ ఎస్టీపీ శుద్ధి చేయగలదా? లేక సామర్థ్యం పెంచాలా? లేదా కొత్త ఎస్టీపీ అవసరమా? అనే అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
అన్ని ఎస్టీపీల మురుగు శుద్ధి వివరాలు, గణాంకాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందించాలని ఎండీ సూచించారు. దీనివల్ల ఎక్కడినుంచి అయినా సమాచారాన్ని పర్యవేక్షించవచ్చని తెలిపారు.
నానక్ రాం గూడ ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని గోల్ఫ్ కోర్టు వినియోగానికి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం ఓఆర్ఆర్ వెంట పైప్‌లైన్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో గార్డెనింగ్ అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించే అంశంపై సంబంధిత అధికారులతో చర్చించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీజీఎంలు పద్మజ, వాస సత్యనారాయణ, జీఎం మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


