Uppal Nallacheruvu: హైడ్రా కృషి ప్రశంసనీయమ్
హైదరాబాద్: పర్యావరణ హిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి హైడ్రా చేస్తున్న కృషి అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణలో హైడ్రా చొరవ ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా నగరంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా విశేషంగా కృషి చేస్తోందన్నారు.
వరద నివారణతో పాటు పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, భూగర్భ జలాల సంరక్షణకు చెరువుల ప్రాధాన్యత ఎంతో ఉందని పేర్కొన్నారు. చెరువులతో పాటు పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోతున్నాయని తెలిపారు.
ఉప్పల్‌లోని ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవానికి మంగళవారం వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ పి. మహేందర్ రెడ్డితో కలిసి ఉప్పల్ నల్లచెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువును ఎలా అభివృద్ధి చేస్తున్నారనే విషయాలను అక్కడ పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్స్ సంస్థ యజమాని మహమ్మద్ యూనస్‌ను అడిగి తెలుసుకున్నారు. చెరువు అభివృద్ధి పనులకు సంబంధించిన 3డీ నమూనాలను మంత్రి పరిశీలించారు.
ఫ్రంట్ ఎలివేషన్ బాగుండాలి..
ఉప్పల్ నల్లచెరువు ఫ్రంట్ ఎలివేషన్ ఆకర్షణీయంగా ఉండాలని మంత్రి సూచించారు. వరంగల్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని సుమారు కిలోమీటరు పొడవున విస్తరించిన ఈ చెరువును రోడ్డు పొడవునా అందంగా తీర్చిదిద్దాలని తెలిపారు.
చెరువు చుట్టూ 2 కిలోమీటర్లకు పైగా వాకింగ్ ట్రాక్, చిన్నపిల్లల కోసం ప్లే ఏరియా, సీటింగ్ సౌకర్యం, పచ్చిక బయళ్లు, పార్కులు, అన్ని వయసుల వారికి వ్యాయామ పరికరాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు వివరించారు. మురుగు నీరు చెరువులో కలవకుండా డైవర్ట్ కాలువలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఆక్రమణల కారణంగా 55 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువును 69 ఎకరాలకు విస్తరించామని పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పలు మార్లు స్థలాన్ని సందర్శించి పనులను పర్యవేక్షించారని తెలిపారు. ఆక్రమణల తొలగింపులో హైడ్రా చొరవ చెరువు విస్తరణకు దోహదపడిందన్నారు. చెరువులో 3 మీటర్ల మేర పూడిక తొలగించామని, ప్రధాన ద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వివరించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


