Musi Riverfront Development: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్ మహానగర అభివృద్ధికి మూసీ నది పునరుజ్జీవం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి, టెండర్లు పిలిచి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ధి పనులు ప్రారంభించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
శాసనసభలో మూసీ పునరుజ్జీవంపై ప్రశ్నోత్తరాల సందర్భంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్‌కు సంబంధించిన లక్ష్యాలు, ఉద్దేశాలను సభ్యులకు వివరించారు. అభివృద్ధి చెందిన నగరాలను అధ్యయనం చేసిన అనంతరం మూసీలో శుద్ధమైన నీరు నిరంతరం ప్రవహించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా నదీ పరివాహక ప్రాంతాల చుట్టూ మానవ నాగరికత అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌లోనూ నిజాం హయాంలోనే మూసీ తీరం వెంబడి గొప్ప అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. 1908 వరదల అనంతరం నగరానికి శాశ్వత పరిష్కారంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు.
ప్రస్తుతం మూసీ నది కాలుష్యం కారణంగా పరివాహక ప్రాంతాల్లో పర్యావరణం, ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. పరిశ్రమల మలినాలు, ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం కన్సల్టెన్సీలను నియమించి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
బాపూ ఘాట్ వద్ద మూసా–ఈసా నదుల సంగమంలో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటయ్యే గాంధీ సరోవర్‌ను ‘V’ ఆకారంలో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. మొత్తం 20 టీఎంసీలలో 15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5 టీఎంసీలను మూసీలో శుద్ధమైన నీరు నిరంతరం ప్రవహించేందుకు వినియోగించనున్నట్లు చెప్పారు.
ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) రూ.4,000 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించిందని, కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు కూడా లభించాయని ముఖ్యమంత్రి తెలిపారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కూడా ప్రణాళికలో భాగమని చెప్పారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు మెరుగైన నివాసాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఓల్డ్ సిటీతో సహా నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మంచిరేవుల సమీపంలోని పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, మూసీ తీరం వెంబడి గురుద్వారా, మసీదు, చర్చి నిర్మాణాల ద్వారా మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
డీపీఆర్ సిద్ధమైన తర్వాత శాసనసభ ముందు ఉంచి, ప్రజాప్రతినిధులు మరియు నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూలంగా, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


